Thursday, December 18, 2014

భక్తి/ధర్మం వల్ల ప్రయోజనము

లోకమునందు ధర్మప్రవర్తన కలిగియుండే వారి సంఖ్య తక్కువైన రోజులివి. అట్టి సత్పురుషుడుండిన కూడా వానిని పరులు ఆక్షేపించు రోజులు. వానిని అనుదినము వేధించు ప్రశ్న ఏమనగా "ధర్మాచరణ చేయుచున్నాను కాని దాని వల్ల నాకు ప్రత్యక్ష ప్రయోజనమేమి కానరాదు. కాని ధర్మదూరములగు పనులు చేసెడివారు లోకమున సుఖించుచున్నారు". కాని నిజముగా పరికించిన ధర్మము వల్ల పెక్కు ప్రయోజనములు కలుగును. అందులకే పెద్దలు "ధర్మో రక్షతి రక్షితః" అన్నారు.


ధర్మము వలన ప్రథమ ప్రయోజనము భగవంతుని కృప అని చెప్పవచ్చును. భగవంతుడు ధర్మస్వరూపుడు. అందులకే రామో విగ్రహవాన్ ధర్మః అని అందురు. పరమాత్మ నిత్య దీప ధూప నైవేద్యాదులతో పూజించు ధర్మదూరుడగు వ్యక్తి కంటే, ఒక్క నమస్కారము చేసే ధర్మాత్ముని ఎక్కువ ఇష్టపడును. ధర్మాత్ముడైన వ్యక్తి పొందు మరొక ప్రయోజనము మానసిక ప్రశాంతత. తన కల్మషము లేని జీవనము వలన మనసు తేలికగా ఉండును.

ధర్మము/భక్తి వలన వచ్చు అనుషంగిక ప్రయోజనములు ఎటువంటివో బ్రహ్మశ్రీ చాగంటి వారు చెప్పిన ఉదాహరణ --

ఒక వ్యక్తి అరణ్య మార్గము గూండా ప్రయాణిస్తున్నాడు. మార్గమధ్యములొ బాగా ఆకలి వేసి ఒకచోట ఆగి తన వద్ద ఉన్న రొట్టెలు కాల్చుకుని తినడానికి నిప్పు రాజేసుకున్నాడు. అతని ప్రథమ ప్రయోజనము ఆకలి తీర్చుకోవడమే. కాని అతడు అనుషంగికముగా చీకటి దూరమై కాంతి లభించింది. ఆ నిప్పు చూసి భయపడి క్రూర మృగములు, విషకీటకములు అతని వద్దకు రాలేదు. అట్లే ధర్మమును అనుష్టించెడు వ్యక్తికి అనుషంగికముగా మరిన్ని ప్రయోజనములు లభించును.

No comments: